
పదాల నీ యెద, స్వరాల సంపద. తెలుగు సాహిత్యంలో మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో, గతించిపోని గాధ నీది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కొన్ని వేల పాటలను రచించిన గేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి గారు. కేవలం తేట తెలుగు పదాలను ఉపయోగించి కొన్ని వేల పాటలకు సాహిత్యం అందించడం అనితరసాధ్యం.
ఒక పత్రిక ప్రతిపాదకునిగా తన జీవితాన్ని మొదలు పెట్టి, నేడు అఖిలాంధ్ర ప్రజల గుండెల్లో ఎనలేని ప్రేమను, పేరును సంపాదించి ఒక గొప్ప గేయ రచయితగా నిలిచిన వేటూరి సుందర రామమూర్తి గారు జనవరి 29, 1936 న కృష్ణా జిల్లాలోని పెదకళ్ళేపల్లి గ్రామంలో జన్మించారు. 10వ తరగతి వరకు మచిలీపట్నంలో, ఇంటర్మీడియట్ ను మద్రాసులో పూర్తి చేశారు. బెజవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యరికంలో డిగ్రీని పూర్తి చేశారు. తర్వాత 1956లో ఆంధ్రప్రభ పత్రికలో జర్నలిస్టుగా చేరారు. అక్కడ అప్పటి సిమిమాలకు రివ్యూలు రాసేవారు. ఆ పత్రికను దర్శకులు బాపు గారు, రచయిత వెంకటరమణ గారు నడిపేవారు. అలా వాళ్ళతో వేటూరి గారికి పరిచయం పెరిగింది. కాని ఆయనను సినీ రంగానికి పరిచయం చేసినది కళాతపస్వి విశ్వనాథ్ గారు. 1974లో తన ' ఓ సీత కథ ' సినిమాలో పాటలు వ్రాయడానికి అవకాశం ఇచ్చారు. అప్పుడే వచ్చిన వేటూరి గారికి పాటలలో పదప్రయోగం ఎలా చేయాలని నేర్పించినది కె.వి.మహదేవన్ గారు.
అలా చిత్ర రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతున్న వేటూరి గారికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిన సినిమా శంకరాభరణం. ఆ చిత్రం ఎంత హిట్ అయ్యిందో ఆ సినిమా పాటలలో తెలుగుతనాన్ని ప్రతిబింబించినందుకు గాను అంతటి పేరును పొందారు. ఈ చిత్రంలోని 'శంకరా నాదశరీరాపరా' పాటకు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డును కూడా అందుకున్నారు.
భక్తి పాటలే కాకుండా మాస్ పాటలలో కూడ తన ప్రతిభను చాటుకున్నారు. ' ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే ' అంటూ అలరించారు. ' కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి...' అని రాసిన పాటలోని సాహితీ సుగంధం మనందరిని ఇప్పటికీ పరవశింప చేస్తుంది. ఆయన పద ప్రయోగాలు అనంత సాగరం. ' మౌన విచక్షణ, గాన విలక్షణ, రాగమే యొగమని.. ' ఒక పాట గొప్పతనాన్ని మనకి చవి చూపించారు. ' కృషి వుంటే మనుషులు ఋషులౌతారు, మహా పురుషులౌతారు....' అంటూ మనల్ని చైతన్య పరిచారు.
మనసుని ఆహ్లదపరిచే గీతాలే కాదు, మనల్ని కంటతడి పెట్టించే గీతాలు కూడా ఎన్నో ఆయన కలం నుండి జాలువారాయి. 'పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు పేట్టే మూఢ లోకం..' అంటూ పదబంధాలతో కన్నీటిని తెప్పించారు. 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..' పాట మన మదిని కదిలింప చేస్తుంది. బహుశా పాటకు ప్రాణం పోయడం అంటే ఇదేనేమో ! ఈ పాటకు జాతీయ పురస్కారం వచ్చినా, అప్పటి ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వలేదని ఆ పురస్కారాన్ని తిరస్కరించారంటే ఆయనకు తెలుగు భాష అంటే ఎంత మక్కువో తెలుస్తుంది.
తెలుగు భాషపై ఆయనకున్న మమకారం అనంతం. ఆయన స్వర సంపద అనిర్వచనీయం. అలరించే పాటలే కాకుండా సాంఘికంగా కూడ తన కలంతో యుద్ధం చేశారు. ' ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో...' అంటూ మహిళలపై జరుగుతున్న అన్యాయాలను నిలదీసారు. అన్నమయ్య జననాన్ని వివరిస్తూ ' తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం...' అని రాసిన పాట అంతరార్ధం వేటూరి గారికి కూడ వర్తిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
అలనాటి విశ్వనాథ్, సంగీతం శ్రీనివాసరావు నుండి నేటి శేఖర్ కమ్ముల, గుణ శేఖర్ దర్శకులతో పని చేసి వేల పాటలు రాశారు అంటే ఆయన పాండిత్యం అపరిమితము. తెలుగు సినిమా పాటలే కాదు, తమిళ సినిమాలకు కూడ తెలుగులో సాహిత్యం అందించడంలో ఈయనకు ఈయనే సాటి. ఆయన స్ప్రశించని భావం లేదు. భక్తి గీతాలు, విప్లవ గీతాలు, సాంస్కృతిక పాటలు, జానపద గేయాలు ఇలా కొన్ని వేలకు పైగా గేయాలను మనకు అందించి కళామతల్లికి ఎనలేని సేవ చేశారు.
ఈయనను వరించిన పురస్కారాలు కూడా అసంఖ్యాకం. మూడు దశాబ్దాలలో 8 నంది అవార్డులను కైవసం చేసుకున్నారు. రాయల వారి కాలం నాటి తెలుగు సంస్కృతిని, ప్రజల జీవనాన్ని తెలియపరుస్తూ ' సిరికా కొలను చిన్నది ' అనే పుస్తకాన్ని మరియు సినీ మహనీయుల గురించి చెబుతూ ' కొమ్మ కొమ్మకో సన్నాయి ' పేరిట పుస్తకాలను కూడా రచించారు. ఇలా తెలుగు పాటకు దేశవ్యాప్తంగా కీర్తిని సంపాదించి పెట్టిన వేటూరి గారు 2010, మే 22న స్వర్గస్థులయ్యారు. నేడు ఆయన మనతో లేకపొవచ్చు.. కానీ తన పాటల రూపంలో మనందరిలో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు.
ఎంతో అధ్బుతంగా ఉంది ఈ వ్యాసం. ముఖ్యంగా వేటూరి గారు వ్రాసిన పాటలనే కొద్దిగా మలచి, వాటి ద్వారా మన యొక్క ఆలోచనలను అర్థవంతంగా, చక్కని స్పష్టతతో చెప్పడానికి ఎంతో శ్రమ, సృజనాత్మకత అవసరం.
మీ యొక్క కృషిని ఇలాగే కొనసాగించండి. జయీభవ !