top of page

యాత్ర

Writer's picture: Akshara NIT TrichyAkshara NIT Trichy
  1. మారేడుమిల్లి:



గోదావరి జిల్లాలు ఎకో-టూరిజంకి పెట్టింది పేరు.కోనసీమ నుంచి రంపచోడవరం వరకు ప్రకృతి ప్రేమికులను మాత్రం నిరాశపరచని అందాలు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి సొంతం.సహజ సిద్ధమైన ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు మారేడుమిల్లి ప్రాంతం.రాజమండ్రి నుంచి 85 కీ.మీ. దూరం లో భద్రాచలం రహదారి వెంబడి తూర్పు కనుమల అడవీ ప్రాంతం లో ఉన్నదీ మారేడుమిల్లి.రాజమండ్రి నుంచి RTC బస్సులు అందుబాటులో ఉంటాయి.అక్కడ బస చేయటానికి ఎన్నో రిసోర్ట్లు ,జీప్ ద్వారా అడవిని చుట్టి వచ్చే సదుపాయాలు కూడా ఉన్నాయి.మన వీలును బట్టి ప్రదేశాన్ని ఒకటి లేదా రెండు రోజుల్లో చుట్టేయ్యొచ్చు. ఇక్కడ బసకు 4౦౦౦ నుంచి 6౦౦౦ ఖర్చు అవుతుంది.దగ్గర్లోని కాఫీ,పెప్పర్ తోటలు,అమృతధార జలపాతాలు,టైగర్ రిజర్వు ,నైట్ క్యాంపింగ్, ముఖ్యం గా 'గుడిస' అనే చిన్న ఊరు చూడదగిన ప్రదేశాలు.


2. కొలనుపాక జైన్ టెంపుల్



సుమారు 2000 సంత్సరాల క్రితం మన తెలుగు రాష్ట్రాలలో బౌద్ధ,జైన మతాలు విరాజిల్లాయి.అందువల్లనే ఎన్నో బౌద్ధ స్థూపాలు,శిథిలాలు మనకు అమరావతి,గుంటూరు వంటి ప్రాంతాలలో కనిపిస్తాయి.ఇదే విధంగా సుమారు 2000 సంత్సరాల పురాతన ,నేటికీ వాడుకలో ఉన్న జైన దేవాలయం మన తెలంగాణ లోని యాదాద్రి జిల్లా ,కొలనుపాక లో ఉంది.శ్వేతాంబర జైనులకు ఇది ఒక ముఖ్యమైన ఆలయం.హైదరాబాద్ నుంచి 80 కీ.మీ.,వరంగల్ నుండి 78 కీ.మీ. దూరం లో కొలనుపాక లో ఈ దేవాలయం ఉంది.జైనుల మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడికి ప్రతీక గా ఈ ఆలయాన్ని నిర్మించాఱు.ఈ ఆలయాన్ని ఎర్ర ఇసుక రాయి,తెల్ల పాల రాయిలతో జైన నిర్మాణ శైలి ఉట్టి పడేలా రూపుదిద్దారు. అంతేగాక 51 అంగుళాల ఎత్తున్న "జేడ్"రాయితో కట్టిన మహావీర్ విగ్రహం ఒక ప్రధాన ఆకర్షణ.ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది.మహావీర్ జయంతి రోజు ఈ ఆలయాన్నిసందర్శించటానికి సరైన రోజు. చారిత్రక స్థలాలు సందర్శించే పర్యాటకులకు ఇది దగ్గర లో ఉన్న చక్కటి ప్రదేశం.


3. ఓర్వకల్లు రాక్ గార్డెన్:


కర్నూల్ నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో కర్నూల్ నుంచి 25 కీ.మీ. దూరం లో ఈ రాక్ గార్డెన్ ఉంది.ఈ చోటు సినిమా షూటింగులకు ప్రసిద్ధి. బాహుబలి సినిమాలో మన కట్టప్ప ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు చుడండి ....ఆ సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు!!కర్నూల్ నుంచి RTC బస్సులు అందుబాటులో ఉంటాయి.ఇక్కడి దగ్గరలోని కేతవరం కొండలలో ,10000 ఏళ్ళ నాటి ఆదిమానవులు సంచారం చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.ఇందుకు గుర్తుగా వారు వేసిన బొమ్మలు,చిహ్నాలు,వాళ్ళ లిపి మనం చూడవచ్చు.లోయలు ,నీటి ప్రవాహాలు ,ఒక ప్రదేశాన్ని ఎలా మలుస్తాయో ఈ రాతులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.ఇక్కడి రాయి ఇగ్నియస్ రాక్స్ నుంచి ఏర్పడింది.క్వార్ట్జ్ ,సిలికా వంటి పధార్ధాలతో ఇక్కడి రాతి శిలలు సహజ సిద్ధం గా ఏర్పడ్డాయి. ఇక్కడ చూడదగ్గ మరో స్థలం డిస్నీ బర్డ్ వాచింగ్ స్పాట్.




4. గండికోట కాన్యోన్స్:




గండికోట కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతం లోని ఒక పల్లెటూరు.జమ్మలమడుగు నుంచి 15 కీ.మీ. దూరం లో ఉంది.రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకొనేవారు ఎన్ హెచ్ 7 మీదుగా కర్నూల్ వచ్చి ,అక్కడి నుండి జమ్మలమడుగు -->గండికోట చేరుకోవచ్చు.సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు ఈ ప్రదేశాన్ని చూడటానికి అనువైన సమయం.ఈ ప్రదేశాన్ని మన భారత దేశపు గ్రాండ్ కెన్యాన్ గా కూడా పిలుస్తారు. 'U' ఆకారం లో పెన్నా నది ఏర్పరచిన ఈ కెన్యాన్ చుట్టూ గండికోట కోట యొక్క శిథిలాలు మనం చూడవచ్చు.ఈ లోయ అంచున నిలబడి ఆకుపచ్చని పెన్నా నది ఆ రాతిలోయలను చీల్చుకుంటూ ఉండగా.... సూర్యాస్తమయం వీక్షించడం ఎంతో ప్రమోదం.కానీ దగ్గరలో సరైన హోటల్స్ ఉండవు.కానీ ఈ ప్రాంతాన్ని ఒక్క రోజులో చుట్టేయొచ్చు.అంతేగాక..ఇక్కడకు దగ్గరలో 60 కీ.మీ. దూరం లో భారత దేశపు రెండవ అతి పెద్ద గుహల సముదాయం బెలుం గుహలు ఉన్నాయి.


5. హంసలదీవి:



మహాబలేశ్వర్ లో జన్మించిన కృష్ణ నది మూడు రాష్ట్రాల గుండా ప్రవహించి హంసలదీవి వద్ద సముద్రం లో కలుస్తుంది.హంసలదీవి విజయవాడకు 110 కీ.మీ.,మచిలీపట్నం నుంచి 35 కీ.మీ. దూరం లో ఉన్నది.విజయవాడ నుంచి అవనిగడ్డ ...,అక్కడి నుంచి హంసలదీవి వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి.కానీ బస్సుల ఫ్రీక్వెన్సీ తక్కువ.రాత్రి పూట బస చేయటానికి సరైన సౌకర్యాలు అందుబాటులో ఉండవు.ఒక రోడ్ ట్రిప్ కు ఇది చాల అనువైన ప్రాంతం.కారు లేదా బైక్ ద్వారా రాత్రి పూట ప్రయాణించి హంసలదీవి బీచ్ కు ఉదయాన్నే చేరుకోవటం సరైన సమయం.ఇక్కడ చాల అరుదైన 'బ్యాక్ టైడ్స్' ను కృష్ణ నది లో చూడవచ్చు.అంతేగాక ఇక్కడి సన్ సెట్స్ కూడా కనుల విందుగా ఉంటాయి.తీరం వెంబడి మొత్తం దివిసీమ ప్రయాణం ఆహ్లాద భరితం గా ఉంటుంది.


6. అనంతగిరి హిల్స్,వికారాబాద్:



హైదరాబాద్ నుంచి 80 కీ.మీ.దూరం లో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పరిధి లో ఉన్న అటవీ ప్రాంతం లో ఉన్నది అనంతగిరి.హైదరాబాద్ లోని ఎన్నో చెరువులకు,మూసి నదికి నీరు అందిస్తాయి ఈ దట్టమైన అడవులు.వికారాబాద్ నుంచి 10 కీ.మీ. రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.హైదరాబాద్ నుంచి వికారాబాద్ కు రైలు ద్వారా గానీ,రోడ్డు ద్వారా కానీ చేరుకోవచ్చు.ఈ కొండల పైనుండి నీరు హైదరాబాద్ దగ్గరలోని ఒస్మానాసాగర్ మరియు అనంత సాగర్‌కు ప్రవహిస్తాయి.సుమారు ౩౦౦౦ ఎకరాలకులు పైబడి విస్తరించిన ఈ అడవులలో ,ఎన్నో ప్రకృతి అందాలు చూడవచ్చు.మూసి నది జన్మ స్థలం,అనంతగిరి హిల్ పాయింట్ ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు.ఈ ప్రాంతం సినిమా షూటింగులకు చాలా ప్రసిద్ధి.ఇక్కడ బస చేయటానికి రిసార్ట్స్ ఉన్నాయి.తెలంగాణటూరిజం అధికారిక వెబ్సైటు లో ఇందుకు సంబంధించిన సమాచారం అంతా ఉంది.ఈ ట్రిప్ మొత్తం ౩౦౦౦ నుంచి 4000 రూపాయల ఖర్చు అవుతుంది.


7. వరంగల్ కోట:



వరంగల్ కు వెళ్లిన ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సినది వరంగల్ కోట.కాకతీయులు నిర్మించుకున్న ఈ కోట కాకతీయ రాజవంశం పాలనలో ఈ ప్రాంతం యొక్క చారిత్రక సంపదకు ప్రతీక. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 5 కీ.మీ.దూరంలో ఉంటుంది.ఎన్నో ఆక్రమణ ల వలన శిథిలమైన ఈ కోట ,ఒక పూర్తి స్థాయి కోట కు ఉండవలసిన హంగులను కోల్పోయింది.అయినప్పటికీ 13 వ శతాబ్దపు నిర్మాణ శైలి గురించి అవగాహన వచ్చేలా ఎన్నో కట్టడాలు ఇంకా అందుబాటులో ఉన్నాయి.కోటకు నిజమైన ఆకర్షణలు ...'రాష్ట్ర ముద్ర' ఐన నాలుగు కీర్తి తోరణాలు (నాలుగు ద్వారాలు).ఉదయం 9 గంటల నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.ఎంట్రీ ఫి 15 రూపాయలు ,కెమెరా కు పాతిక రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అంతే కాక సాయంత్రం 6 : 30 నుంచి 8 : 30 వరకు లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంటుంది.వీకెండ్ కు వరంగల్ కు వచ్చి చుట్టు పక్కల ఉన్న వరంగల్ కోట,పాఖాల లేక్,రామప్ప,1000 స్థంబాల గుడి చూడటానికి అనువైన సమయం.


8. పాఖాల లేక్ :



వరంగల్ నుండి 50 కీ.మీ. దూరం లో నరసంపేట కు దగ్గర ఉన్నది పాఖాల లేక్ మరియు వైల్డ్ లైఫ్ సాంక్చువరి .ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీక్షకులకు అందుబాటులో ఉంటుంది.ఈ ప్రదేశం... కుటుంబం తో కలిసి నాణ్యమైన సమయాన్ని వెచ్చించటానికి ఎంతో అనువైనది.ఇది ఒక కృత్రిమ సరస్సు.కాకతీయ రాజులు దూరదృష్టి తో దీనిని నిర్మించారు.నవంబర్ నుంచి మార్చ్ మధ్యలో ఎన్నో పక్షులు ఇక్కడకు వలస వస్తాయి.కాబట్టి ఇక్కడకు వెళ్ళటానికి ఇదే అనువైన సమయం. దగ్గర లో బస చేయటానికి ఎటువంటి సౌకర్యాలు లేవు.వరంగల్ లోని హోటల్ లో ఉంటూ.... వరంగల్ కోట,పాఖాల లేక్ ఒకేసారి చూసి రావటం మంచిది.వన్య మృగాలా ప్రేమికులకు ఈ ప్రాంతం తక్కువ బడ్జెట్ లో చాలా అనువైనది...మీ DSLR ను మాత్రం మర్చిపోవద్దు.....!!!


9. హార్స్లీ హిల్స్:



ఆంధ్ర ఊటీ గా పిలవబడే హార్స్లీ హిల్స్ చిత్తూరు జిల్లా మదనపల్లె కు 27 కీ.మీ.,తిరుపతి కి 140 కీ.మీ. దూరం లో దిగువ తూర్పు కనుమలలో ఉంది.సముద్ర మట్టానికి 1314 అడుగుల ఎత్తులో ఉండటం వలన నిరంతరం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది.మదనపల్లె నుంచి RTC బస్సుల సదుపాయం కలదు.ఈ ప్రదేశాన్ని చూడటానికి జనవరి ,ఫిబ్రవరి నెలలు అనువైన ప్రదేశం.కొండపై అతిథి గృహాలు ఉంటాయి.ట్రెక్కింగ్,తాళ్ల వంతెన పై నడవటం వంటి కృత్యాలు పర్యాటకులకు వినోదం పంచుతాయి.ఇక్కడ ఉండే విష్పర్ విండ్ పాయింట్ వరకు ట్రెక్కింగ్ చేసి అక్కడ నుంచి ప్రాంతం యొక్క వ్యూ పాయింట్ చూడటం ఒక ఆనవాయితీ.దగ్గర లో కైగల ఫాల్స్,జూ వంటి ఆకర్షణలు కూడా ఉన్నాయి.సుమారు 1000 నుంచి 2000 రూపాయల లోపే ప్రదేశాన్ని చుట్టి రావచ్చు.


Comments


bottom of page