గురు పూర్ణిమ విశిష్ఠత:
ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. హిందూ సంప్రదాయంలో ఆది గురువు శివుడు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన ఢమరుకం నుంచి నాదం పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని మహా విష్ణువు బ్రహ్మదేవునికి ఉపదేశించారు. బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశించారు. శక్తి మహర్షి తన కుమారుడైన పరాశర మహర్షికి ఉపదేశించారు. పరాశర మహర్షికి, సత్యవతికి పుట్టిన పుత్రుడే కృష్ణ ద్వైపాయనుడు. పరాశర మహర్షి తన పుత్రుడుకి వేదాన్ని ఉపదేశించారు.
ఈ మధ్యలో చాలా కాలం గడిచిపోయింది. ఈ లోపు ఈ వేదం చాలా మందికి ఉపదేశించబడినది, కానీ గ్రంథస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు కనకే వేదానికి ' శ్రుతి ' అని పేరు. కలియుగ ప్రారంభానికి ముందు కృష్ణ ద్వైపాయనుడు ఒకటిగా వున్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి, వాటిని గ్రంథస్థం చేసి, వేదవ్యాసుడుగా పేరుగాంచారు. శ్రుతులుగా వున్న వేదాన్ని మానవాళికి అందించారు గనక వేదవ్యాసుడు మానవ జాతి అంతటికీ గురువు అయ్యారు. అందుకే వేదవ్యాసుడు పుట్టిన రోజును గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమగా జరుపుకుంటాం.
భారతదేశంలోనే కాకుండా గురుపూర్ణిమ నేపాల్, భూటాన్లో బౌద్ధులు, జైనులు కూడా జరుపుకోవటం విశేషం. బౌద్ధ సంప్రదాయం ప్రకారం ఈ రోజున గౌతమ బుద్ధుడు సారనాథ్, ఉత్తర్ ప్రదేశ్ లో తన మొదటి ఉపన్యాసం ఇచ్చారు. అలాగే జైనులు ఈరోజునే త్రీనొక్ గుహ పూర్ణిమగా జరుపుకుంటారు.

గురుపూర్ణిమ జరుపుకొనే విధానం:
కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మకాయలు ఉంచు తారు. ఆదిశంకరాచార్యులు, అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపుతారట. బియ్యం, కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో, షిరిడీలో, శృంగేరీలో, శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.
గురువు అంటే ఎవరు:
గు అంటే అంధకారం లేదా అజ్ఞానం, రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అర్థం. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్నినశింప చేయువారు అని అర్థం. ఆ విధంగా చూస్తే దాదాపు మనకు ఎదురైన ప్రతి మనిషి, ప్రతి సమస్య మనకు ఒక గురువు. మనల్ని మోసం చేసిన వాళ్ళు ఈ లోకంలో అందరూ నమ్మకస్తులు అనే అజ్ఞానాన్ని తొలగిస్తారు. అలాగే ఒక మంచి స్నేహితుడు అందరూ మోసగాళ్లు అనే అపోహను తొలగిస్తారు. మన అజ్ఞానాన్ని తొలగించిన మన గురువులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, "గురుపూర్ణిమ శుభాకాంక్షలు"
Follow our Instagram channel for more content like this: https://instagram.com/akshara.nitt?utm_medium=copy_link
Comments