top of page

UNESCO International literacy day: 8th September | Article in Telugu

Writer's picture: Ponguru DhanushPonguru Dhanush


" అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం"


‘‘రేపు మరణించాలనుకుంటే ఈ రోజు జీవించు. ఎప్పటికీ జీవించి ఉండాలనుకుంటే జ్ఞాన సముపార్జన చెయ్యి’’ అని అన్నారు మహాత్మాగాంధీ గారు. మానవ ప్రగతికి,అభివృద్ధికి అక్షరాస్యత తప్పనిసరి.అక్షరాస్యత ప్రజల జీవన పరిస్థితులను మార్చేస్తుంది. ఇది ప్రజలు వారి వారి భావనలను తెలియజేయుటకు మరియు వారి వారి సంస్కృతిని బలపరచుకునేలా చేస్తుంది. వీటిని నిజం చేయుటకు నలభై సంవత్సరాలుగా సెప్టెంబరు 8 వ తేదీన యునెస్కో అంతర్జాతీయ అక్షరాస్యత ఉత్సవాలను జరుపుతోంది. విద్య అనేది చీకటి నుండి వెలుగులోకి వెళ్ళే ఉద్యమం. కావున అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా దాని ప్రాముఖ్యతను మరియు చరిత్ర గురించి తెలుసుకుందాం.


చరిత్ర:


ఒక నాడు ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేను అనుసరించి ప్రతి ఐదుగురు మగవారిలో ఒకరు, మూడింట రెండు వంతుల మంది స్త్రీలు నిరక్షరాస్యులని తేలింది.ప్రపంచవ్యాప్తంగా 776 మిలియన్లమంది వయోజనులు కనీసం వాళ్ల పేరును రాయలేని స్థితిలో ఉండటం దురదృష్టం.ఇటువంటి దుర్భరమైన స్థితిని మార్చేందుకు "యునెస్కో" ముందుకు వేసిన అడుగే ఈ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. సెప్టెంబరు 8 వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం జరుపుకోవాలని 1965 నవంబరు 7 న యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం నిశ్చయించింది. మొట్టమొదటగా 1966లో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి.


యునెస్కో ఆవిష్కరణ:


యునెస్కో అనగా ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ), సాంస్కృతిక సంస్థ (యునెస్కో). ఇది ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రధాన అంగము. దీనిని 1945లో స్థాపించారు. ఈ సంస్థ తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణలకు తోడ్పాటునందించటమేగాక... అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం, సాంస్కృతిక పరిరక్షణ కోసం పాటుపడుతుంది. యునెస్కో తన తన కార్యక్రమాలను విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక, మానవ శాస్త్రాలు మొదలగు రంగాలలో నిర్వహిస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం... వివిధ దేశాలలో విద్యావిధానలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్‌లు చేపట్టడం.


యునెస్కో ‘నిర్బంధ, ఉచిత విద్య పౌరుల ప్రాథమిక హక్కు, ఏది నేర్చుకోవాలన్నా అందుకు పునాది’ చదువే అని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తుంది.


ప్రాముఖ్యత మరియు విజయాలు:


యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యతను పెంచుటకు చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలను అందించాయి. నిరక్షరాస్యుల దృష్టిని విద్య వైపు మళ్లించి, వారికి ఉండే సాంఘిక హక్కులను, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకునేలా చేయడం ఈ సంస్థ మరియు వారి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం.


యునెస్కో 1990 సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది. ఇక ఐక్యరాజ్య సమితి అయితే 2003-2012 దశాబ్దాన్ని అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది. "లిటరసీ ఫర్ ఆల్, వాయిస్ ఫర్ ఆల్, లెర్నింగ్ ఫర్ ఆల్" అనే అంశాల్ని ఈ దశాబ్ది లక్ష్యంగా నిర్దేశించింది.


ఇక ఇతర దేశాలతో పోలిస్తే మన భారతదేశం అక్షరాస్యతలో తక్కువ స్థాయిలో ఉంది. 120కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో 75 శాతం కంటే తక్కువ అక్షరాస్యత శాతం ఉండటం గమనార్హం. ఈ మాత్రమైనా మనదేశ అక్షరాస్యత ఉందంటే దానికి కారణం కొన్ని రాష్ట్రాలు అక్షరాస్యతను సాధించటంలో ముందుండటం తప్ప మరొకటి కాదు. చాలా రాష్ట్రాలు సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం. స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే దేశంలో 80 శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది.


అక్షరం ఆయుధం కన్నా గొప్పది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. అయినా అక్షరంపై నిర్లక్ష్యం వీడడం లేదు.పేదరికాన్ని పారద్రోలడానికి, శిశు మరణాలు తగ్గించడానికి, అధిక జనాభా నియంత్రణకు, లింగ వివక్షత లేకుండా ఉండటానికి విద్య చాలా అవసరం. ప్రతి అక్షరాస్యత పౌరుడూ కుటుంబం పట్ల, సంఘం పట్ల, దేశం పట్ల బాధ్యతగా ప్రవర్తించడానికి నిరంతర విద్యాభ్యాసం దోహద పడుతుంది. కావున మనం మన గురించే గాక మనకు ఉన్న జ్ఞానన్ని ఇతరులకు కూడా పంచి అందరిని చైతన్యవంతం చేయాలన్నదే ఈ అంశం ముఖ్య ఉద్దేశం.

Comments


bottom of page