ప్రాణం పోసేది దేవుడైతే ప్రాణం నిలిపేవాడు డాక్టర్. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు.
పెద్దయ్యాక ఏమవుతారని ప్రశ్నిస్తే చాలామంది పిల్లలు చెప్పే సమాధానం డాక్టర్ అవుతామని. సమాజంలో వైద్యవృత్తికి ఉన్న గౌరవం, ప్రత్యేక గుర్తింపు అలాంటిది మరి.
వైద్యులు తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టేసి తెల్లకోటుకే ప్రాధాన్యమిస్తారు. వారి నిబద్ధత, త్యాగనిరతి, ఎదుటివారి ప్రాణాలను కాపాడాలనే తపన, మానవసేవే మాధవసేవ అన్నట్లుగా ఉండే వారి సేవానిరతి ఎంతో గొప్పవి. వైద్యులు చేసే సేవను గుర్తిస్తూ భారతదేశంలో ప్రతియేటా జులై 1న 'డాక్టర్స్ డే' గా జరుపుకుంటాం. ఈరోజు ప్రాధాన్యత తెలుసుకుందాం:
అద్వితీయ సేవలతో భారతీయ వైద్యరంగానికి విశిష్ట గుర్తింపు తెచ్చిన డా. బిధాన్ చంద్ర రాయ్ జన్మదినం జులై 1, 1882. కలకత్తా మేయర్ గా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా, కౌన్సిల్ అఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేసారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయన సమాజానికి చేసిన సేవలకు గాను 1961లో ప్రతిష్టాత్మక 'భారతరత్న' అవార్డు లభించింది. ఆయన గౌరవార్ధం 1991 నుండి భారతదేశంలో డాక్టర్స్ డే జరుపుకుంటున్నాము.
![](https://static.wixstatic.com/media/c20a83_296e85dad50b4d2b954cc9bc5b112589~mv2.jpg/v1/fill/w_980,h_980,al_c,q_85,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/c20a83_296e85dad50b4d2b954cc9bc5b112589~mv2.jpg)
భారతీయ వైద్య సంస్థ (ఐ.ఎమ్.ఏ) డాక్టర్స్ డేని నిర్వహిస్తుంది. ఈ సంస్థలోని సభ్యులు ప్రస్తుత కరోనా పరిస్థితులలో మార్పు తేవడానికి కృషి చేస్తున్నారు. డాక్టర్స్ డే 2020 - కరోనా వైరస్ ను అధిగమించడానికి పనిచేస్తున్న అనేకమంది డాక్టర్లకు, కోవిడ్ కేర్ సెంటర్లకు అంకితం. ఈ సంవత్సర నేపథ్యం - 'కోవిడ్ 19 యొక్క మృతుల సంఖ్యను తగ్గించడం'. మన సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్న డాక్టర్లను గౌరవిద్దాం. వారిపై జరుగుతున్న హింసను అరికడదాం.
కరోనా వంటి తీవ్రమైన మహమ్మారి ప్రబలుతున్న సమయంలో కూడా మన ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తూ, వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క వైద్యునికి చేతులెత్తి జోడిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతోంది అక్షర.
Follow our Instagram channel for more content like this:
https://instagram.com/akshara.nitt?utm_medium=copy_link
Comments