top of page

సాంబడి కథ

Writer's picture: Akshara NIT TrichyAkshara NIT Trichy

కృష్ణుని ప్రస్థానము బాల్యం నుంచి మహాభారత యుద్ధం వరకు మనకు సుపరిచితమే!! కానీ కృష్ణుని పరిపాలన, తన కుటుంబం, తన మరణం గురించి మనలో ఎన్నో అపోహలు సంచారణలో ఉన్నాయి. ఈ రోజు కృష్ణ జాంబవతిల కుమారుడైన సాంబ పరోక్షంగా కృష్ణుడి మరియు తన సామ్రాజ్య పతనానికి ఎలా కారణం అయ్యాడో తెలుసుకుందాం.

ఒకానొక రోజు. ద్వారక లో.......తనకు మాత్రమే కుమారుడు లేడని చింతిస్తున్న జాంబవతి కృష్ణుడిని సమీపించి, తనకు కూడా ప్రద్యుమ్నుడి వలె సకల గుణాలు కలిగిన కుమారుడిని ప్రసాదించమని ప్రాధేయపడింది. అందుకు అంగీకరించిన శ్రీకృష్ణుడు, తన కుమారుడు మహాశివుని వలె సద్గుణాలు కలవాడై ఉండాలని తీర్మానించుకొన్నాడు......తరువాత ఉపమన్యముని సలహా మేరకు మహాశివుని కోసం నెలల తరబడి ఘోరమైన తపస్సు చేసాడు. కృష్ణుడి తపస్సుకు మెచ్చిన శివుడు తన కోరికను అడుగగా కృష్ణుడు తన మనఃవాంఛితమైన తన(శివుని)వలె ఉండెడి కుమారుడిని కోరుకొన్నాడు. శివుని ప్రతీకగా జాంబవతి కృష్ణులు తమ కుమారునికి 'సాంబ' గా నామకరణం చేసారు.

సాంబ యుక్త వయస్సుకి చేరుకున్నాడు.... ఇటులుండగా, దుర్యోధనుడు తన కుమార్తె లక్ష్మణ యొక్క స్వయంవరం ఏర్పాటు చేసాడు. అక్కడకు వచ్చిన రాకుమారులలో సాంబ కూడా ఒకడు. ఐతే లక్ష్మణ యొక్క అందానికి ముగ్ధుడైన సాంబ, తనపై వరమాల పడకముందే బలవంతంగా లక్ష్మణను తనవెంట స్వయంవరం నుంచి తోడ్కొని పోయాడు. ఇందుకు ప్రతీకారంగా దుర్యోధనుడు సాంబను బంధించి చెరసాలలో ఖైదు చేసాడు. కానీ తన ధైర్యానికి మెచ్చిన లక్ష్మణ, సాంబను తన భర్తగా అంగీకరించింది. కృష్ణుని అన్న బలరామునికి సాంబ అంటే మిక్కిలి ప్రేమ.తనను విడిపించమని దుర్యోధనుడుని కోరాడు బలరాముడు.ఇదే అదునుగా భావించిన దుర్యోధనుడు, తమ కాళ్ళ బేరానికి వచ్చినందుకు కృష్ణబలరాములను అవమానించాడు.అందుకు కోపించిన బలరాముడు తన నాగలితో చెరసాలను ఛిద్రం చేసైనా సరే సాంబ ను విడిపిస్తానని హెచ్చరించాడు!!.చేసేదేమీ లేక సాంబను విడిచి పెట్టాడు దుర్యోధనుడు.తరువాత ఇరు కుటుంబాల అనుమతి మేరకు సాంబ లక్ష్మణను పరిణయమాడాడు.!ఈ సంఘటనల ద్వారా తాను చేసే తప్పులను సమర్ధించడానికి బలరాముడు రూపంలో ఒక చుక్కాని దొరికినట్లయింది.తన నిర్లక్ష్యధోరణి నానాటికీ పెరిగిపోసాగింది.

ఇటులుండగా .... ఒకానొక రోజు శ్రీకృష్ణుడు ద్వారకకు ముగ్గురు మహామునులు తన రాజప్రాసాదానికి ఆహ్వానించాడు. వారు విచ్చేసిన సమయంలో కృష్ణుడు విశ్రమించుచున్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన సాంబ తన బంధు పరివారంతో కలిసి ఋషులను ఆటపట్టించసాగాడు. అంతేగాక సాంబ మారువేషంలో ఉదరాన గదను ధరించి ఒక గర్భిణి రూపంలో ఋషుల వద్దకు వచ్చి తనకు పుట్టబోయే బిడ్డను గురించి అడుగసాగాడు. తమకు జరుగుతున్న అవమానాన్ని గ్రహించిన మునులు సాంబ ను శపించారు.తనకు పుట్టబోయే బిడ్డ వెనువెంటనే ఒక 'గద' వలె మారిపోతారని,ఆ గద వలనే కృష్ణుడు,అతని రాజ్యం నాశనమవుతుందని శపించాడు.ఈలోగా అక్కడకు వచ్చిన శ్రీకృష్ణుడు జరిగిన దానిని గురించి తెలుసుకొని చింతించెను.ఐతే ఋషులకు తన శాపాన్ని వెనక్కు తీసుకొనే శక్తి లేదు.తన కుమారుని తరుపున క్షమాపణ చెప్పి వాళ్ళకు సకల మర్యాదలు చేసి పంపాడు.

కొంతకాలం తరువాత శాప ప్రభావం వలన సాంబ లక్ష్మణల కుమారుడు పుట్టిన వెనువెంటనే ఒక గద లాగా రూపాంతరం చెందాడు. జరగబోయే సంఘటనలను, తమ నాశనాన్ని గ్రహించిన కృష్ణకుటుంబీకులు కృషుడిని కలువగా ...., తన సలహా మేరకు ఉగ్రసేన మహారాజుని కలిసారు. ఉగ్రసేన మహారాజు ఆదేశం మేరకు గదను సముద్రం లో కలపాలని సూచించాడు. ఐతే గద నుంచి వెలువడిన ఇనుపధూళి వలన సముద్ర తీరంలో ఏరకా గడ్డి పెరగ సాగింది. అంతేకాక తరువాతి కాలం లో ఏరకా గడ్డి నుంచి వచ్చిన స్థలం నుంచే కృష్ణపరివారం తమ ఆయుధాలను తయారుచేసుకున్నారు.శాపప్రభావం వలన తమ లోని అంతఃకలహాల చేత ఒకరిని ఒకరు అనుమానించి,విభేదించి చంపుకోసాగారు.సముద్రంలో వదిలివేసిన ఇనుప గదను తిన్న ఒక చేప చివరికి 'జరా' అనే వేటగాడి వద్దకు చేరింది.ఆ ఇనుప ముక్కను జరా తన బాణపు ముక్కొణగా మార్చుకున్నాడు.అదే బాణంతో ఒక రోజు కృష్ణుడు చెట్టు కింద నిద్రిస్తూఉండగా ఒక అడవి జంతువని భ్రమపడి కృష్ణుడి మీదకు తన శరాఘాతాన్ని సంధించాడు.అది తన కాలి వేలుకు తగిలి ,శ్రీకృష్ణుని మరణానికి కారణమయ్యాడు .

శివుడు లయాకారుడు. తన అనుగ్రహం వలన జన్మించాడు కాబట్టే సాంబ కృష్ణుడి రాజ్యానికి, కుటుంబానికి, చివరికి పరోక్షంగా తన మరణానికి కూడా కారణం అయ్యాడు.!!!!






Comments


bottom of page